China H9N2 outbreak: చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో చైనాలోని వూహాన్ నగరంలో ఇలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని తాజా అవుట్ బ్రేక్ గుర్తుకు తెచ్చింది.
ఈ నేపథ్యంలో భారత్‌లో దీని ప్రమాదం తక్కువే అని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా కేసులు, శ్వాసకోశ వ్యాధుల నుంచి భారత దేశానికి ప్రమాదం తక్కువగా ఉందని తెలిపింది. చైనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Read Also: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన
ఉత్తర చైనాలో ప్రస్తుతం H9N2 కేసులు, శ్వాసకోశ వ్యాధుల ఇటీవల పెరిగాయి.ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు గత కొన్ని వారాలుగా చైనాలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత పెరిగిందని, పిల్లల్లో ఈ అనారోగ్యం పెరిగిందని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.‘‘ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత దేశం సిద్ధంగా ఉందని, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు సమగ్రమైన రోడ్ మ్యాప్ అనుసరించడానికి భారత్ ఒక ఆరోగ్య విధానాన్ని పాటిస్తుంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయంగా బలోపేతం చేయడం జరిగింది’’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
2023 అక్టోబర్‌లో చైనాలో WHOకి నివేదించబడిన H9N2 (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్) యొక్క మానవ కేసు నేపథ్యంలో దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కేసులపై సంసిద్ధత చర్యల గురించి చర్చించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ అంచనా మేరకు హెచ్9ఎన్2 కేసుల్లో మానవుడి నుంచి మానవుడకి వ్యాపించే సంభావ్యత తక్కువగా ఉండటమే కాకుండా, మరణాల రేటు కూడా తక్కువ అని కేంద్రం తెలిపింది. మానవులు, పశు సంవర్థక, వన్యప్రాణుల రంగాల మధ్య నిఘాను పటిష్టం చేయడం ముఖ్యమని చెప్పింది.