BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సం జరిగే రోజే సర్వమత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ముఖ్యమంత్రి ‘సంప్రీతి యాత్ర’ గురించి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి వెళ్లడం లేదు, ఇక్కడ ఊరేగింపు చేస్తు్న్నారు, ఆమె ఎవరిని కలుపుతోంది..? బెంగాల్‌లో రక్తపాతం జరుగుతోందని, ఆమెను రాముడు కూడా క్షమించడని మండిపడ్డారు.
మరో బీజేపీ నేత సుకాంత మజుందార్.. హిందువులు మైనారిటీలుగా ఉన్న పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో బాబర్ మద్దతుదారులు రామ మందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఉత్సవాలకు అంతరాయం కలిగించవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్‌ని మమతా బెనర్జీ ఉగ్రవాదులకు కేంద్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగే రోజే ‘సర్బ ధర్మ‘ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమె కాళీఘాట్ ఆలయంలో పూజలు చేసి ర్యాలీలో పాల్గొంటారని బెనర్జీ తెలిపారు. అన్ని మతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు.