Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల హింస చెలరేగిన సంభాల్‌కి రేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ బృందంతో రాహుల్ గాంధీ ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. నవంబర్ 24న యూపీలోని సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో వేల సంఖ్యలో గుంపు అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి చేసింది. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
Read Also: Cement Prices: 5 ఏళ్ల కనిష్టానికి సిమెంట్ ధరలు.. కారణం ఇదే…
ఈ హింసపై మొత్తం 07 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 20కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో స్థానిక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్‌తో పాటు ఆ ప్రాంత ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందని పోలీసులు అభియోగాలు మోపారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున తమ పార్టీ బృందాన్ని సంభాల్ వెళ్లకుండా యూపీ పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత సచిన్ చౌదరి ఆరోపించారు. సంభాల్ హింసపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మొఘలుల కాలం నాటి ఈ మసీదు ఒకప్పుడు హరిహర మందిరమని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది. సర్వేకి వెళ్లిన సమయంలోనే హింసాత్మక దాడులు జరిగాయి. బాబర్ కాలంలో నాటి ఈ మసీదుని ఆయన స్థానంలో హిందూ బేగ్ అనే వ్యక్తి నిర్మించినట్లు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. మొఘలుల కాలం నాటి ‘‘బాబర్ నామా’’; ‘‘ఐన్ ఈ అక్బరీ’’ గ్రంథాల్లో ఈ మసీదు ప్రస్తావన ఉంది. దీనిని హిందూ పక్షం కోర్టులో లేవనెత్తింది.