లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడింది.శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో లతా మంగేష్కర్ కు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు. “గాయని లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారు, కానీ ఈ రోజు ఆమె ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉంది. ఆమెను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ”అని డాక్టర్ పేర్కొన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని లతా మంగేష్కర్ బృందం ఇప్పటికే ప్రజలను కోరింది.
అయితే లతా మంగేష్కర్‌కు కరోనా సోకడంతో పాటు న్యుమోనియా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో చేరారు. ఆనాటి నుంచి ఆమె ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది. అంతేకాకుండా 1969 సంవత్సరంలో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్ లతో పాటు 2001లో భారతరత్న అవార్డులు ఆమెను వరించాయి.