Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాలూకు మొత్తం ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మిసా భారతి, రోహిణి ఆచార్యలను ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకుంటున్నారు.
Read Also: Gorantla Butchaiah Chowdary: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి..
మిసా భారతిని పాట్టీపుత్ర, రోహిణి ఆచార్యను సరన్ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో ఆర్జేడీ టికెట్ తరుపున పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే, పాట్లీపుత్ర నుంచి ఆ పార్టీకి చెందిన స్ట్రాంగ్ లీడర్ రిట్లాల్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. కూతురిని సార్వత్రిక ఎన్నికల్లో దింపేందుకు ఆమె నుంచి కిడ్నీ లాక్కున్నారు అని లాలూపై విమర్శలు గుప్పించారు.
బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తు్న్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల పంపిణీ మొదలైంది. అంతకుముందు ఈ కూటమిలో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఉన్నప్పటికీ, ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి ఆయన బీజేపీతో జతకట్టారు. ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరారు. బీహార్‌లో ప్రస్తుతం జేడీయూ-బీజేపీ కూటమి అధికారంలో ఉంది.