Lalit Modi Sushmita Sen Break Up: తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ.. కొన్నాళ్ల క్రితం ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుస్మితా షేన్ షాకిచ్చిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంపై సుస్మితా నోరు విప్పలేదు కానీ, లలిత్ మోదీ మాత్రం సోషల్ మీడియాలో ఓపెన్‌గా తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు, తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తన ప్రేయసి సుస్మితాతో కొత్త జీవితాన్ని ప్రారంభించానని రాసుకొచ్చాడు. ఆమెతో కలిసి ఉన్న ఫోటోని డీపీగా పెట్టుకున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి రాగానే.. నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ జోడీ ఎలా కుదిరింది? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. డబ్బుల కోసమే సుస్మితా అతనితో ప్రేమలో పడిందంటూ విమర్శలూ చేశారు.
ఆ సంగతుల్ని పక్కన పెట్టేస్తే.. తాజాగా లలిత్ మోదీ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుస్మితాతో ఉన్న ఫోటోను తొలగించడంతో పాటు బయోలో ఆమె ప్రస్తావనని తొలగించాడు. ఇప్పుడు ఆయన బయోలో ‘‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మూన్’’ అని మాత్రమే రాసి ఉంది. దీంతో.. ఈ ప్రేమ జంట విడిపోయిందా? అనే అనుమానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వీళ్లు విడిపోయారు కాబట్టే లలిత్ మోదీ తన బయోలో నుంచి ఆమె పేరుని తొలగించాలని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు మాత్రం లలిత్ మోదీ ఖాతాలో ఉన్నాయి. కానీ.. డీపీ మార్చడం, బయోలో ఆమె పేరు తీసెయ్యడం హాట్ టాపిక్‌గా మారింది. జులై 14 తర్వాత సుస్మితాతో సన్నిహితంగా ఫోటోలను లలిత్ మోదీ షేర్ చేయలేదు. కేవలం తనకు సంబంధించిన ఫోటోలు, పోస్టులను మాత్రం పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. చూస్తుంటే.. వీరి ప్రేమ వ్యవహారం కూడా ముణ్ణాళ్ల ముచ్చటలాగే ఉన్నట్టు కనిపిస్తోంది.