Laila Khan Murder Case: 13 ఏళ్ల క్రితం సంచలన సృష్టించిన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమె సవతి తండ్రికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. లైలా ఖాన్ సవతి తండ్రి అయిన పర్వేజ్ తక్ 2011లో ఆమెతో పాటు ఆమె తల్లి, నలుగురు తోబుట్టువులను హత్య చేశాడు. ఈ హత్య కేసు ‘అత్యంత అరుదైన’ కేటగిరీ కిందకు వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు పేర్కొంటూ, నిందితుడికి మరణశిక్ష విధించింది. హత్య మరియు సాక్ష్యాలు ధ్వంసం చేసినందుకు మే 9న పర్వేజ్ తక్‌ని కోర్టు దోషిగా నిర్ధారించింది.
శుక్రవారం న్యాయమూర్తి ఎస్బీ పవార్ మాట్లాడుతూ.. ఈ కేసు అరుదైన కేటగిరి కిందకు వస్తుందని హత్య నేరంలో పర్వేజ్ తక్‌కి మరణశిక్ష విధించస్తున్నట్లు, సాక్ష్యాలు ధ్వంసం చేసినందుకు కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ. 10,000 జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే, మరణశిక్షను బాంబే హైకోర్టు నిర్ధారించాల్సి ఉంటుంది.
Read Also: Seethakka: ఆదివాస బిడ్డనైన నన్ను మంత్రిగా చూసి కొందరు ఓర్చుకోలేకపోతున్నారు
లైలా, ఆమె తల్లి సెలినా, నలుగురు తోబుట్టువులను ఫిబ్రవరి 2011లో మహారాష్ట్రలోని ఇగత్‌పురిలోని వారి బంగ్లాలో పర్వేజ్ తక్ హత్య చేశాడు. తక్‌కి అతని భార్య సెలీనా(51)కు చెందిన ఆస్తిపై గొడవ జరిగింది. మొదట ఆమెను హత్య చేసి, తర్వాత లైలా(30)ను ఆమె అక్క అజ్మీనా(32), కవల తోబుట్టువులు ఇమ్రాన్, జరా(25)లతో పాటు కజిన్ రేష్మాను హత్య చేసి అక్కడి నుంచి స్వస్థలం జమ్మూ కాశ్మీర్ పారిపోయాడు. తన కూతురు, మాజీ భార్య కనిపించకుండా పోయారని లైలా ఖాన్ తండ్రి నాదిర్ పటేల్ ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో హత్య ఉదంతం బయటకు వచ్చింది. కాశ్మీర్‌లోని తక్ స్వస్థలంలో అతడిని జూలై 8, 2012లో అరెస్ట్ చేశారు.
సెలినా కుటుంబం తనను సేవకుడిలా చూస్తోందని, వారు దుబాయ్ మకాం మార్చేటప్పుడు తనను ఇండియాలోనే వదిలేస్తారని తక్ భయపడినట్లు తెలిసింది. బాధితుల కుళ్ళిపోయిన మృతదేహాలను లైలా ఖాన్ కుటుంబానికి చెందిన ఇగత్‌పురిలోని ఒక ఫామ్‌హౌస్ నుండి తరువాత స్వాధీనం చేసుకున్నారు. తక్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ 40 మంది సాక్షులను విచారించింది. ఈ కేసులో మరణశిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంకజ్ చవాన్ కోరారు. ఒక కుటుంబంలోని ఆరుగురిని క్రూరమైన హింసాత్మక చర్యలో చంపి, వారి మృతదేహాలను పారవేయడం పథకం ప్రకారం జరిగిన హత్య అని చవాన్ పేర్కొన్నాడు.