Vande Mataram Row: వందేమాతరం వివాదం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘‘వందేమాతరం’’ గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే, ఈ వివాదంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. వందేమాతరం పాత వెర్షన్ పాడటం నేరమైతే, అదే పాటను ఆలపించిన మహాత్మా గాంధీ, మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయిలపై కూడా కేసులు పెట్టాలని ఖర్గే అన్నారు. వందేమాతరం పాడకుండా సోనియాగాంధీ అడ్డుకున్నారనే బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండించింది.
ఖర్గే ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితిలో ఉన్నందున ఆయనకు కుర్చీ వేయాలని సోనియా గాంధీ నిర్వాహకులకు సంకేతం ఇచ్చారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తెలిపారు. వందేమాతరం ఆపాలని ఆమె సూచించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై సోనియా, రాహుల్ గాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సోమవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ వివాదంపై ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాడిన వందేమాతరం మహాత్మా గాంధీ, నెహ్రూలు పాడిన పాత వెర్షన్ అని చెప్పారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ ఇదే విధానంలో జాతీయ గీతాన్ని ఆలపిస్తోందని, ఇది నేరమైతే గాంధీ, నెహ్రూలపై కూడా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ వివాదం మధ్య సోమవారం గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఖర్గే వందేమాతరం తొలి రెండు చరణాలు ఆలపించారు. ఈ ఏడాది కేంద్రం బహిరంగ సమావేశాలు, పాఠశాలల్లో, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. పాటను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, గౌరవానికి భంగం కలిగించడం నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.

