Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోడీ ‘‘విషపు పాము’’అని, ఇది నిజమా కాదా..? అని తేలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని, అప్పుడు మీరు శాశ్వతంగా నిద్రపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతోతందని, దీంతో నిరాశ కనిపిస్తోందని అన్నారు.
Read Also: Infosys: ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి.. రైతుగా లక్షల్లో సంపాదిస్తున్న టెక్కీ..
గతంలో సోనియా గాంధీ ‘‘ మౌత్ కా సౌదాగర్’’ వ్యాఖ్యలతో ఏం జరిగిందో.. ప్రస్తుతం ఖర్గే వ్యాఖ్యలకు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని, కాంగ్రెస్ మరింత లోతుకు కూరుకుపోతోందని, కర్ణాటక కాంగ్రెస్ లో నైరాశ్యం కనిపిస్తోందని మాల్వియా ట్వీట్ చేశారు. ఖర్గే మనుసులో విషం ఉందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ పట్ల పక్షపాత ధోరణి అని, రాజకీయంగా తమతో పోరాడలేక, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం బస్వరాజ్ బొమ్మై అన్నారు. ప్రధాని మోదీని ప్రపంచం మొత్తం గౌరవిస్తోందని, సీనియర్ నాయకుడు అయిన ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం చెప్పాలనుకున్నాడని, ఆయన దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో ఖర్గే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను ప్రధాని మోడీని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించలేదని, బీజేపీ సిద్ధాంతం పాములాంటిదని నా ఉద్దేశ్యం అని, నేను ప్రధాని మోడీని వ్యక్తిగతంగా ఎప్పుడూ ఇలా అనలేదని, వారి సిద్ధాంతం పాము లాంటిదని మాత్రమే చెప్పానని, దాన్ని తాకాలని చూస్తే మీ మరణం ఖాయం అని అన్నానని ఖర్గే వివరణ ఇచ్చారు.