Kerala High Court Verdict on Sabarimala Temple: అయ్యప్ప స్వామి దర్శనం, మకరజ్యోతిని చూసేందుకు భక్తులు శబరిమలకు పయణం అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ హైకోర్టు శబరిమలపై కీలక తీర్పును వెలువరించింది. శబరిమల గర్భగుడిలోకి రాజకీయ నాయకులు, ప్రముఖుల పోస్టర్లను తీసుకెళ్లే యాత్రికులను అనుమతించవద్దని శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. దేవస్థానం సన్నిధానంలోకి పోస్టర్లు మోసుకెళ్లడాన్ని నిషేధించింది.
Read Also: Pathaan Trailer: రామ్చరణ్ విడుదల చేసిన ‘పఠాన్’ ట్రైలర్
ఆలయ ప్రాంగణంలో భక్తులు తగిన రీతిలో పూజలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బోర్డును ఆదేశించింది. యాత్రికులు సినీనటులు, రాజకీయ నాయకులు పోస్టర్లను మోసుకుని సంగీత వాయిద్యాలతో ప్రదర్శనలు ఇస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. న్యాయమూర్తులు అనిల్ కె నరేంద్రన్, పిజి అజిత్కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయ్యప్ప స్వామి పట్ల భక్తి, ఆరాధన ప్రదర్శించే భక్తుడు శబరిమలలోని ఆచారాలు, సంప్రదాయాలకు లోబడి పూజించే హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.
శబరిమల గర్భాలయాన్ని తెరిచే సమయంలో డ్రమ్మర్ శివమణిని శబరిమల సోపానం ముందు డ్రమ్స్ వాయించేందుకు అనుమతించడంపై కేరళ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సోపానం ముందు డ్రమ్స్ లేదా ఇతర వాయిద్యాలు వాయించడానికి యాత్రికులకు అనుమతి లేదని పేర్కొంది. శబరిమల భక్తుడు ఒకరు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిని సుమోటోగా తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.