మరోసారి థర్డ్‌వేవ్ రూపంలో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారి కట్టడికి అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో కాస్త పరవాలేదు అనిపించినా.. లేదా ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినా.. సడలింపులు పెంచుతూ వస్తున్నాయి ప్రభుత్వాలు.. తాజాగా, కరోనా కట్టడి కోసం విధించిన వీకెండ్ లాక్‌డౌన్‌ను కర్ణాటక ప్రభుత్వం ఎత్తివేసింది.. రాష్ట్రంలోని ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీలో హోం శాఖ, ఆరోగ్యశాఖ, విద్యా శాఖ, జలవనరుల శాఖ మంత్రులు, బీబీఎంపీ అధికారులు కూడా పాల్గొన్నారు.. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు రెవెన్యూ శాఖ మంత్రి అశోక్.
Read Also: కరోనా కొత్త వేరియంట్: లక్షణాలు ఏంటి? ఎవరికి డేంజర్..? ఏం చేయాలి..?
రాష్ట్రంలో జనవరి నుంచి కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు మంత్రి అశోక్.. మరోవైపు.. వారాంతపు లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దీనిపై సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిపై చర్చించిన తర్వాత.. నిపుణుల సూచన మేరకు వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక, రాజధాని బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయని స్పష్టం చేసిన ఆయన.. ఇదే సమయంలో రాత్రి కర్ఫ్యూను మాత్రం యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తామని తేల్చేశారు. కానీ, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదని… పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతి ఉందని.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రజలు గుంపులు చేరోద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం.