Bengaluru stampede case: బెంగళూర్‌లో ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట కేసులో అరెస్టులకు సంబంధించిన పిటిషన్లు విచారిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జవాబుదారీతనం కోసం కోర్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, దాని పర్యవసానాలపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని సూటిగా ప్రశ్నించింది.
ఈ ఘటన దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసినట్లు కోర్టుకు సమాచారం అందింది. అయితే, ఇప్పటి వరకు బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టులు చేసింది. నిందితులను కబ్బన్ పార్క్ పోలీసులు హాజరుపరుస్తున్నారు.
హైకోర్టు ప్రభుత్వానికి సంధించిన 9 ప్రశ్నలు:
1) విజయోత్సవ వేడుకల్ని ఎప్పుడు, ఎవరు ఏ విధంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..?
2) ట్రాఫిక్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకున్నారు..?
3) వేదిక వద్ద వైద్య, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారా..?
4) వేడుక సమయంలో ఎంత మంది వ్యక్తులు, ఎవరు ఉండవచ్చనే దానిపై ముందస్తు అంచనా వేశారా..?
5) గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడానికి ఎంత సమయం పట్టింది..?
6) ఈ తరహా క్రీడా కార్యక్రమం లేదా వేడుకల్లో 50,000 మరియు అంతకంటే ఎక్కువ మంది జనసమూహాన్ని నిర్వహించడానికి ఏదైనా SOP (ప్రామాణిక ఆపరేటింగ్ విధానం) రూపొందించబడిందా?
7) ఈవెంట్ నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా..?
8) ప్రజల్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?
9) గాయపడిన వారికి వెంటనే వైద్య సౌకర్యం అందించారా..? లేకుంటే ఎందుకు..?
దీనికి ప్రతిస్పందనగా, రాష్ట్రం సమాధానాలను దాఖలు చేయడానికి సమయం కోరింది. వీటిని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని భావిస్తున్నారు. సోమవారం, తొక్కిసలాటకు సంబంధించి అరెస్టయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారి నిఖిల్ సోసాలే తన అరెస్టు చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఈవెంట్ నిర్వాహక సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్‌లో, ముఖ్యమంత్రి అందరినీ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారని పేర్కొంది.