కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప మళ్లీ సీఎం కాబోతున్నారు. అయితే ఇది నిజంగా కాదండోయ్. కేవలం సినిమా వరకే పరిమితం. సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన చాలామందిని మనం చూశాం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఆరితేరి ఇప్పుడు ముఖానికి రంగేసుకుంటున్నారు. తనూజ అనే సినిమాతో యడ్యూరప్ప తెరంగేట్రం చేస్తున్నారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో యడ్యూరప్ప సీఎంగా నటిస్తున్నారు. హరీష్ ఎండీ హళ్లి ఈ మూవీకి దర్శకుడు. బియాండ్ విజన్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ప్రస్తుతం యడ్యూరప్పకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని దర్శకుడు వెల్లడించాడు. ఈ సినిమాలో యడ్యూరప్ప నటించడం వెనుక ప్రధానమైన కారణం లేకపోలేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనూజ అనే అమ్మాయి కోవిడ్ కారణంగా నీట్ పరీక్ష రాయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ తర్వాత ఓ ఇద్దరు జర్నలిస్టుల సాయంతో ఆమె పరీక్ష రాసింది. నీట్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తనూజ పరీక్ష రాసేందుకు 350 కిలోమీటర్లు ప్రయాణించింది.