నోట్ల కట్ల వ్యవహారంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న తరుణంలో సుప్రీం ధర్మాసనాన్ని వర్మ ఆశ్రయించారు. తనపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదిక తప్పు అంటూ న్యాయస్థానంలో సవాల్ చేస్తూ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో న్యాయ సూత్రాలను పాటించలేదని ఆరోపించారు. తనను పూర్తిస్థాయిలో విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్‌ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇక విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం కేంద్రం తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియను చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జస్టిస్ యశ్వంత్‌వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం.. మెటా క్షమాపణ
జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం
మార్చి 14న జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11:43 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు.. సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు నగదు ఉంటుందని సమాచారం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం దీన్నే వర్మ సవాల్ చేశారు.