Supreme Court Collegium: సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు జడ్జిల బదిలీలకు సిఫారసు చేసింది. బదలీల్లో 23 మంది హైకోర్టు జడ్జిలు ఉన్నారు. వారిలో గుజరాత్ హైకోర్టు జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ కూడా ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి సిఫార్సులు చేసింది. 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం రెండు సమావేశాల్లో నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3న జరిగిన సమావేశంలో 9 మంది న్యాయమూర్తులను, ఆగస్టు 10న నిర్వహించిన సమావేశంలో మరో 14 మంది న్యాయమూర్తుల బదిలీలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకుంది.
Read also: Mahesh Babu: బాబు ల్యాండింగ్.. ఇక రచ్చ షురూ
బదిలీలు పొందుతున్న వారిలో గుజరాత్ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ కూడా ఉన్నారు. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను గత నెల జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ తిరస్కరించారు. తీర్పుపై స్టే విధించడానికి సహేతకమైన కారణం లేదని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానిస్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీం ధర్మాసనం సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సైతం పాల్గొన్న విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించిన జాబితాను గత రాత్రి సుప్రీంకోర్టు తన అధికారి వెబ్‌సైట్‌లో ఉంచింది. ‘మెరుగైన న్యాయం కోసం’ బదిలీలను కొలీజియం సిఫార్సు చేసినట్టు ప్రకటించింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్..గతంలో 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ మాంత్రి మాయ కోద్నానీ లాయర్ల బృందంలో ఓ సభ్యుడు. గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ ప్రచ్చక్.. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించగా.. 2019 వరకూ అదే పదవిలో ఉన్నారు. తరువాత 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ప్రచ్చక్‌తో పాటు 2002 గోద్రా అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆరోపిస్తూ తనపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ తీస్తా సెతల్వాద్ చేసిన అభ్యర్థనపై విచారణకు నిరాకరించిన జస్టిస్ సమీర్ దవేను, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపిని కూడా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. వారితోపాటు పంజాబ్ హరియాణా హైకోర్టుకు చెందిన నలుగురు, అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒకరు కొలీజియం బదిలీలకు సిఫార్సు చేసిన జాబితాలో ఉన్నారు.