Jharkhand: శివరాత్రి పర్వదినం రోజు జార్ఖండ్ హజారీబాగ్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. హజారీబాగ్‌లోని డమ్రౌన్ గ్రామంలో శివరాత్రి డెకరేషన్‌పై ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడి చేయడంతో పాటు, పలు వాహనాలు, షాపులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
Read Also: Amit Shah: తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్‌కి అమిత్ షా కౌంటర్..
హజారీబాగ్‌లోని ఇచాక్ బ్లాక్ లోని డుమ్రౌన్ గ్రామంలో బుధవారం ఉదయం మహా శివరాత్రి వేడుకల కోసం జెండాలు, లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేయడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు మూడు మోటార్ సైకిళ్లకు, ఒక కారుకు నిప్పుపెట్టారు. ఒక దుకాణాన్ని తగలబెట్టారు. నివేదిక ప్రకారం.. హిందూస్తాన్ చౌక్ వద్ద శివరాత్రి సందర్భంగా జెండాలు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడంపై ఇరు వర్గాల మధ్య వాదన చెలరేగింది. ఇది హింసకు దారి తీసింది. ఇది పూర్తిగా మత ఘర్షణకు దారి తీసి, రాళ్ల దాడి, దహనాలకు కారణమైంది.
ఈ ఘటనను కేంద్రమంత్రి, రాంచీ బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్ ఖండించారు. సరస్వతి పూజ, రామనవమి, హోలీ సమయంలో హింస జార్ఖండ్‌లో సర్వసాధారణమైపోయిందని, ఇలాంటి సంఘటనలకు బంగ్లాదేశ్ చొరబాటుదారులే కారణమని ఆయన ఆరోపించారు. ‘‘శాంతిని ప్రభావితం చేయాలనుకునే వ్యక్తులు ఎవరు..? దేశంలో ఎక్కడా హింస జరగదు. జార్ఖండ్‌లో జరుగుతోంది. ఎందుకు..? ఎందుకంటే బంగ్లాదేశ్ చొరబాటుదారుల జనాభా, శాంతిభద్రతలను ప్రభావితం చేస్తున్నాయి.’’ అని ఆయన అన్నారు.