జార్ఖండ్ లో ఏం జరుగుతోంది? సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిలబడుతుందా? ఇవాళ ఏం జరగబోతోంది? ఇదే అంతటా ఉత్కంఠ రేపుతున్న అంశం. జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఇవాళ బల పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధమయింది. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దటానికి గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బల పరీక్ష నిర్వహణకు యుపిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బలపరీక్ష నేపధ్యంలో అధికార కూటమి ఎమ్మెల్యేలు ఛత్తీస్‌గడ్ నుంచి ఆదివారం రాంచీకి చేరుకున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బిజెపి కుట్రలు సాగిస్తోందన్న ఆందోళనతో గత కొన్ని రోజుల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని నవ రారుపూర్‌లో ఒక రిసార్ట్‌లో అధికార ఎమ్మెల్యేలు బస చేశారు.
Read Also: Astrology: సెప్టెంబర్5, సోమవారం దినఫలాలు
ఆదివారం అక్కడి నుంచి రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం బల పరీక్ష్షకు నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే రారుపూర్‌లో ఉన్న ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడం విశేషం. జార్ఖండ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నెల 1న మా ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలుసుకున్న సమయంలో ఒకటి, రెండు రోజుల్లో పరిస్థితిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. ఇంతవరకూ ఏమీ జరగలేదు. కాబట్టి మేమే రాష్ట్ర అంసెబ్లీల్లో పరిస్థితిని ప్రస్తావిస్తాం.
మా మెజార్టీని నిరూపించుకుంటాం’ అని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం మీడియాకు చెప్పారు. ఎమ్మెల్యేగా సోరెన్‌పై అనర్హత వేటు వేయడం నిలబడదని, దీనిని కోర్టు కొన్ని గంటల వ్యవధిలోనే కొట్టివేస్తుందని కూడా మంత్రి చెప్పారు. మరోవైపు సోమవారం జరిగే సమావేశాన్ని ప్రత్యేక సమావేశంగా పిలవడాన్ని స్పీకర్ రవీంద్రనాథ్ మహతో తిరస్కరించారు. ‘ఈ ఒక రోజు సమావేశం ప్రత్యేక సమావేశం కాదు. గత సెషన్ సమావేశాల్లో అసంపూర్తిగా మిగిపోయిన పనులు పూర్తి చేయడానికి సోమవారం సమావేశం నిర్వహిస్తున్నాం’ అని స్పీకర్ తెలిపారు. ఈ సమావేశంలో విశ్వాస పరీక్షను హేమంత్ సోరెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి వుంది. ఈ నేపథ్యంలో మొత్తం దేశం అంతా జార్ఖండ్ వైపే చూస్తోంది.