Jharkhand Chief Minister H Soren Summoned Tomorrow In Mining Scam Case: అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగం పెంచింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు రావాల్సిందిగా కోరింది. రాంచీలోనీ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో రేపు విచారణకు జరగనుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ జూలైలో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. పంకజ్ మిశ్రా ఖాతా నుంచి రూ. 11.88 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. మిశ్రాతో పాటు అతని ఇద్దరు సహాయకులు బచ్చుయాదవ్, ప్రేమ్ ప్రకాష్ లపై కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Narendra Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..!!
హేమంత్ సోరెన్ రాజకీయ ప్రతినిధిగా ఉన్న పంకజ్ మిశ్రా తన సహచరుల సాయంతో ముఖ్యమంత్రి నియోజకవర్గం అయిన బర్హైత్ నియోజవర్గంలో అక్రమంగా మైనింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మైనింగ్ గురించి, పంకజ్ మిశ్రాతో సంబంధాల గురించి ఈడీ సీఎం హేమంత్ సోరెన్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. సాహిబ్ గంజ్ జిల్లాలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద కేేసులు నమోదు చేసింది ఈడీ.
గతంలో అక్రమ మైనింగ్ లీజు వ్యవహారంలో ముఖ్యమంత్రి సోరెన్ పై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బయాస్కు నివేదిక పంపింది. ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని హేమంత్ సోరెన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఈ లీజు వల్ల సీఎంకు ఎలాంటి ప్రయోజనం పొందలేదని.. లీజు ప్రభుత్వ ఒప్పందం కానందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ వర్తించదని సోరెన్ తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు.