Migrant Labourer From Bihar Shot Dead By Terrorists: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వలస కూలీ, హిందువులను, స్థానికేతరులను టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు ఇటీవల దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి ఇదే విధంగా వలస కూలీని కాల్చి చంపారు. బీహార్ మాదేపురాకు చెందిన వలస కూలీ మహ్మద్ అమ్రేజ్ ను టెర్రరిస్టులు కాల్చిచంపారు. ఈ ఘటన బందిపోరా జిల్లాలోని సోద్నారా సుంబల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి తర్వాత టెర్రిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ సమయంలో మహ్మద్ అమ్రేజ్ పై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో బాధితుడు మరణించాడు.
Read Also: Karnataka: ఇరు వర్గాల మధ్య చిచ్చురాజేసిన ప్రేమ వ్యవహారం.. ఇద్దరు మృతి
అంతకు ముందు రోజు రాజౌరి జిల్లాలో ఆర్మీ క్యాంపుపై దాడి చేయడానికి ప్రయత్నించారు టెర్రరిస్టులు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. 2016 ఉరీ తరహా ఘటన చేసేందుకు మరోసారి టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. అయితే భద్రతా బలగాల ఎదురుదాడిలో టెర్రరిస్టులు చనిపోయారు. స్వాతంత్య్ర వేడుకలకు ముందు దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం బుద్గామ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. గతంలో హిందూ పండిట్ రాహుల్ భట్ , కాశ్మీర్ టీవీ యాక్టర్ అమ్రీన్ భట్ ను కాల్చి చంపారు దుండగులు. ఈ హత్యలతో ప్రమేయం ఉన్న కీలక ఉగ్రవాదిని బుద్గామ్ ఎన్ కౌంటర్ లో హతమర్చాయి.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. సులువుగా లక్ష్యం అయ్యే వలస కూలీలు, హిందువులను టార్గెట్ చేస్తూ చంపుతున్నారు. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద గ్రూప్ తో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్లలో తొలగిస్తున్నాయి.