USA: అమెరికా ఎప్పుడూ కూడా నమ్మకమైన మిత్రదేశంగా ఉండదనేది మరోసారి బహిర్గతమైంది. అమెరికా మాజీ అగ్రశ్రేణి దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. “అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కావచ్చు, కానీ అమెరికాకు స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం.” అని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం అమెరికాకు చక్కగా సరిపోతాయి. భారత్‌తో ఒక వైపు వ్యూహాత్మక సంబంధాలు కావాలంటూనే, మరోవైపు పాకిస్తాన్‌కి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటీవల ఫీల్డ్ మార్షల్‌గా పదొన్నతి పొందిన ఆసిమ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించింది. ఈ వారం వాషింగ్టన్‌లో జరిగే అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలకు ఆసిమ్ మునీర్ వెళ్తున్నారు. అమెరికా ఆహ్వానం మేరకు శనివారం వాషింగ్టన్ లో జరిగే ఈ మిలిటరీ పెరేడ్‌కి మునీర్ హాజరుకానున్నారు. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ వంటి దేశానికి అమెరికా మద్దతు ఇవ్వడం, భారత్-పాకిస్తాన్‌ని ఒకే తీరుగా చూస్తోంది.
Read Also: Bird Hit: పక్షి ఢీకొనడం వల్లే ఎయిరిండియా ప్రమాదం జరిగిందా..? నిపుణుల విశ్లేషణ..
నిజానికి అమెరికాతో స్నేహం అంటేనే కత్తి మీద సాము లాంటిది. నమ్ముకున్న వారిని తన ప్రయోజనాల కోసం నట్టేట ముంచడం దాని నైజం. తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఎవరిని ఎప్పుడైనా వాడుకుంటుంది, వదిలేసుకుంటుంది. నిజానికి, చైనాకు అడ్డుకట్ట వేసేందుకు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్-జపాన్-యూఎస్-ఆస్ట్రేలియాతో ‘‘క్వాడ్ కూటమి’’ ఏర్పాటు చేసింది. తన విషయానికి వస్తే మిత్రదేశాలు సాయం చేయాలని చెబుతుంది, కానీ మిత్రదేశాల విషయాలను తన విషయాలుగా ఏనాడు అమెరికా పట్టించుకోదు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ లోన్ వచ్చేలా చేయడంలో యూఎస్ మద్దతు ఇచ్చింది.
ఇదిలా ఉంటే, అమెరికా టాప్ మిలిటరీ జనరల్ నరల్ మైఖేల్ కురిల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ‘‘ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు’’ ఈ ప్రాంతంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని ప్రశంసించారు. పాకిస్తాన్ ను ‘‘అద్భుత భాగస్వామి’’ అని కొనియాడారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికాకు పాకిస్తాన్ సహకరిస్తోందని చెప్పాడు. అయితే, భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటాన్ని మాత్రం భారత సొంత విషయంగా భావిస్తోంది. ఇది అమెరికా ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తోంది.