IT employee die: కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల పూణేలో ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ మరణించిన విషయం సంచలనంగా మారింది. అన్నా ఆఫీసులో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురై, చనిపోయారు. ఈ ఘటన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి మరణించడం కూడా వైరల్ అయింది. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సదాఫ్ పాతిమా అనే మహిళా ఉద్యోగి కుర్చీలోనే కుప్పకూలి చనిపోయింది. ఆమె మరణానికి పని ఒత్తిడి కారణమని సహోద్యోగులు ఆరోపించారు.
Read Also: Mumbai: బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు..
ఇదిలా ఉంటే, తాజాగా మరో గుండె ఆగిపోయింది. నాగ్‌పూర్‌లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 40 ఏళ్ల వ్యక్తి ఆఫీసులోనే గుండెపోటుతో మరణించాడు. వాష్ రూమ్ వెళ్లి నితిన్ ఎడ్విన్ మైఖేల్ అనే వ్యక్తి అక్కడే కుప్పకూలిపోయాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు వాష్ రూమ్‌లోకి వెళ్లి నితిన్ స్పందించకపోవడంతో అతడి సహచరులు గమనించి ఎయిమ్స్‌కి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి, చనిపోయినట్లు ప్రకటించారు. సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక పోస్టుమార్టం ఫలితాల ప్రకారం.. గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. మైఖేల్‌కి భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.