ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రోజూ 100కి పైగా సైబర్ దాడుల్ని ఎదుర్కొంటోందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళలోని కొచ్చిలో రెండు రోజుల అంతర్జాతీస సైబర్ సదస్సు, కకూన్ 16వ ఎడిషన్ ముగింపు వేడకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులకు అవకాశం చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. ఇటువంటి సైబర్ దాడుల్ని ఎదుర్కొనేందుకు బలమైన సైబర్ సెక్యూరిటీని కలిగి ఉన్నామని ఆయన చెప్పారు.
సాఫ్ట్‌వేర్‌తో పాటు రాకెట్‌లోని హార్డ్‌వేర్ చిప్‌ల భద్రతపై దృష్టి సారించి వివిధ పరీక్షల్లో ఇస్రో ముందుకు వెళుతోందని ఇస్రో చీఫ్ తెలిపారు. ఇంతకుముందు ఒకే ఉపగ్రహాన్ని పర్యవేక్షించే విధానం. ఒకేసారి అనేక ఉపగ్రహాలను పర్యవేక్షించే సాఫ్ట్‌వేర్ మార్గంగా మార్చబడిందని తెలిపారు.
నావిగేషన్, మెయింటెనెన్స్ కోసం వివిధ రకాల శాటిలైట్స్ ఉన్నాయని, ఇవి కాకుండా సాధారణ ప్రజల రోజూవారీ జీవితానికి సహాయపడే ఉపగ్రహాలు వివిధ రకాల సాఫ్ట్‌వేర్లతో నియంత్రించబడతాయని వీటిన్నింటిని రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమని సోమనాథ్ అన్నారు. అధునాతన టెక్నాలజీ ఓ వరమని, అదే సమయంలో ముప్పు కూడా ఉంటుందని హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్ల నేరగాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను మనం అదే టెక్నాలజీతో ఎదుర్కొగలమని ఈ దిశగా పరిశోధనలు, కృషి జరగాలని సూచించారు. సైబర్ రంగానికి తగిన భద్రత కల్పించే సామర్థ్యాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, రాష్ట్రంలో డిజిటల్ యూనివర్సిటీ నెలకొల్పడం ద్వారా ప్రభుత్వం ఈ రంగానికి అవసరమైన తోడ్పాటు కూడా అందిస్తోందని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు.