Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ప్రస్తుతానికి సమసిపోయినట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. ఈ విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. 2023 ఎన్నికల గెలుపు తర్వాత, ముఖ్యమంత్రి పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని అధిష్టానం ఒక ఒప్పందం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ఒప్పందానికి కట్టుబడి తనకు సీఎం పదవి కట్టబెట్టాలని డీకే శివకుమార్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు పవర్ సెంటర్స్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు అనేక చర్చలు నిర్వహించి, రెండు వర్గాలు శాంతియుతంగా ఉండాలని సూచించాయి.
దీంతో ఈ రోజు ఉదయం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. తామిద్దరం ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చారు. అయితే, ఇప్పుడు వీరిద్దరి మధ్య ‘‘రాజీ ఫార్ములా’’ కుదిరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి డీకే శివకుమార్‌ను సీఎం చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అంతవరకు డీకేను శాంతి, సహనంతో ఉండాలని అధిష్టానం కోరవచ్చు.
Read Also: India – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్‌కు భారత్ సహాయం..
డీకే శివకుమార్ తన అనుచరులకు మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు డీకే కర్ణాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగుతారు. 2028 ఎన్నికల ముందు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చి, సీఎంగా బలపరుస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికి ఇప్పుడు తిరిగుబాటు చేసేందుకు డీకే వద్ద తగినంత ఎమ్మెల్యేల సంఖ్య లేదు. ఒక వేళ తిరుగుబాటు చేస్తే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం కావచ్చు. వీటిని కూడా ఆయన పరిగణలోకి తీసుకుని రాజీకి వచ్చినట్లు సమాచారం.
ఇక సిద్ధరామయ్య పలు సందర్భాల్లో ఇదే తన చివరి సీఎం టర్మ్ అని చెప్పారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో డీకేనే సీఎం అభ్యర్థిగా ఉంటారు. ఇక తన రిటైర్మెంట్ గౌరవప్రదంగా సాగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. దీంతో పాటు అహిందా( ముస్లింలు-దళితులు-బలహీన వర్గాలు) పాలిటిక్స్‌లో సిద్ధరామయ్య చాలా కీలకం, మాస్ లీడర్‌గా ఆయనకు పేరుంది. ఇక డీకే శివకుమార్ కర్ణాటకలో ప్రభావం చూసే వొక్కలిగ వర్గానికి చెందినవారు. ఈ సమీకరణం కూడా రాజీకి సహకరించినట్లు తెలుస్తోంది. ఏ ఒక్కరికి మద్దతు ఇచ్చినా, మరో కులం దూరమవుతుందని కాంగ్రెస్ భయపడింది. సిద్ధరామయ్య, డీకేలకు కూడా ఇదే భయం ఉంది.