గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ అనేక విమానాలను రద్దు చేస్తోంది. తాజాగా ఈ సంస్థ మరో 500 ఫ్లైట్లను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీ నుంచి బయల్దేరే 220 మరియు హైదరాబాద్ నుంచి వచ్చే 90 విమానాలు ఉన్నాయి.
అయితే ఇండిగో ఫ్లైట్స్ రద్దు చేయడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇండిగో సిబ్బందిని అడిగినా సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన నీరు, ఆహారం అందించకపోవడం వల్ల పరిస్థితి మరింత కష్టతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు స్థలం లేకపోవడంతో నేలపైనే నిద్రించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇక శబరిమలకు వెళ్లాల్సిన భక్తుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వారు ఇప్పటికే అయ్యప్ప స్వామి దర్శనానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు బోర్డింగ్ గేట్ వద్ద నిలిచి నిరసన చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మూడు రోజులుగా విమానాలు రద్దు కావడంతో ఇండిగో షేర్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో ఇండిగో షేర్ ధర 2.16 శాతం పడిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో డీజీసీఏ (DGCA)ని సంప్రదించింది. ఎయిర్‌బస్ ఏ-320 విమానాలకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ, ఇప్పటివరకు డీజీసీఏ ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు.