India’s first privately developed rocket Vikram-S set for launch today: భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగానికి సిద్ధం అయింది. భారత అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. శుక్రవారం రోజు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి రాకెట్ విక్రమ్-ఎస్ ని ప్రయోగించనున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ గా విక్రమ్-ఎస్ గుర్తింపు పొందింది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి పేరుతో రాకెట్ కు విక్రమ్-ఎస్ గా నామకరణం చేశారు. శుక్రవారం 11.30 గంటలకు నింగిలోకి ఎగరనుంది. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూల్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని ‘‘ప్రారంభ్’’పేరుతో నిర్వహిస్తోంది.
Read Also: Palestine: గాజాలో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి
విక్రమ్-ఎస్ ద్వారా మూడు పేలోడ్లను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రెండు స్వదేశానికి చెందినవి కాగా.. ఒకటి విదేశీ కస్టమర్ కు చెందింది. ఇస్రో మార్గదర్శకత్వంలో శ్రీహరికోట నుండి ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా భారతదేశం చరిత్రను లిఖించబోతోందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. భూమికి 120 కిలోమీటర్ల ఎత్తులో మూడు శాటిలైట్లను విక్రమ్ ఎస్ కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ మూడు శాటిలైట్లు స్పేస్ క్రాఫ్ట్ ఇండియా, ఎన్-స్పేస్ టెక్ ఇండియా, బజూమ్‌క్ ఆర్మేనియాకు చెందినవి.
ఆరు మీటర్ల పొడమైన రాకెట్ మాక్ 5 వేగంతో హైపర్ సోనిక్ వేగంతో వెళ్లే ఈ రాకెట్ ఏడు టన్నుల వాక్యూమ్ థ్రస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది. ధ్వని కన్నా 5 రెట్ల వేగంతో నింగిలోకి దూసుకెళ్తుంది. స్కైరూట్ ఏరోస్పేస్ మొత్తం మూడు విక్రమ్ రాకెట్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో విక్రమ్-1 480 కిలోల పేలోడ్ ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. విక్రమ్-2 595 కిలోలు, విక్రమ్-3 815 కిలోల పేలోడ్ ను లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనుంది.