Internet Economy: భారతదేశంలో శరవేగంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచిన భారత్, డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాబోయే కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీ, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఆరు రెట్లు వృద్ధి చెంది ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని, వచ్చే ఏడేళ్లలో కుటుంబాలు తమ ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నాయని గూగుల్, టెమాసెక్ మరియు బైన్ & కంపెనీ నివేదిక పేర్కొంది.
2030లో భారతదేశ జీడీపీలో ఇంటర్నెట్ ఎకానమీ వాటా 4-5 శాతం నుంచి 12-13 శాతానికి పెరుగుతుందని 350 మిలియన్ల డిజిటల్ చెల్లింపు వినియోగదారులు, 220 మిలియన్ల ఆన్‌లైన్ షాపర్లు ఈ వృద్ధికి కారణమవుతారని నివేదిక పేర్కొంది. భారతదేశ సాంకేతిక రంగానికి ఇంటర్నెట్ ఎకానమీ సహకారం 2022లో 48 శాతం ఉంటే 2030 నాటికి ఇది 62 శాతాని పెరుగుతుందని అంచనాా వేసింది. వినియోగదారుల్లో వచ్చిన మార్పులు, బిజినెస్ ఎకో సిస్టం పరిణామం కారణంగా 2022లో సుమారు 175 బిలియన్ల వినియోగం నుంచి భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ దిశగా దూసుకుపోతుందని ‘ ది ఇ-కానమీ ఆఫ్ ఎ బిలియన్ కనెక్టెడ్ ఇండియన్స్’ నివేదికలో పేర్కొంది.
Read Also: Ram Charan: రామ్ చరణ్- అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు.. ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ
2030 నాటికి కుటుంబ ఆదాయం 2500 డాలర్ల నుంచి 5,500 డాలర్లకి పెరిగి డబుల్ అవుతుందని అంచనా వేశారు. వినియోగదారులు, పెట్టుబడిదారుల సర్వేతో పాటు బైన్ అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం టైర్ 2+ నగరాలు, టైర్ 1, మెట్రో నగరాలకు సమానంగా డిజిటల్ సేవల డిమాండ్ ఉంటుందని అంచానా వేసింది. బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) ఇ-కామర్స్ డిజిటల్ సేవలలో ప్రముఖ వాటాను కొనసాగిస్తుందని, 2030 నాటికి ఐదు-ఆరు రెట్లు పెరిగి 350-380 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ఇండియాలో ఆన్‌లైన్ షాపర్లు కూడా రెట్టింపు అవుతారని భావిస్తున్నారు.
ఇండియాలో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు, వ్యాపారాల్లో డిజిటల్ పెట్టుబడులు, ఇండియా స్టాక్ తో డిజిటల్ డెమెక్రటైనేషన్ భారతదేశాన్ని డిజిటల్ పరివర్తన వైపు తీసుకెళ్తుందని, వినియోగ సామర్థ్యం స్టార్ట్-అప్ కంపెనీల విస్తరణకు అవకాశాలను తెరుస్తాయని, భారీ వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు భారతదేశంలో ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థను ఆరు రెట్లు పెరిగేలా చేస్తుందని అంచనా వేసింది.