INDIA alliance: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభజనకు దారి తీసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించాయి, కానీ అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేదు. 400 సీట్లు అంటూ బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని, కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం చేయగలిగింది ఇండియా కూటమి. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం మరోసారి ఇండియా కూటమి పనితీరుపై అనుమానాలను లేవనెత్తింది. జార్ఖండ్‌లో గెలిచినప్పటికీ, అక్కడ కాంగ్రెస్ నామమాత్రమే. నిజానికి జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ పార్టీ జెఎంఎం ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ, ఓట్ల శాతం పరంగా బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందుంది.
Read Also: Greenland: గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?
ఇదిలా ఉంటే, ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. అయితే, ఎంపీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీ ఢిల్లీలోని 07 ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఆప్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ని కాదని, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ వంటి పార్టీలు ఆప్‌కి మద్దతు ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించామని, తర్వాత ఇండియా కూటమని సజీవంగా ఉంచడానికి ఒక్క సమావేశం జరగలేదని అన్నారు. ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు అందరూ ఇండియా కూటమికి ఇప్పుడు ఉనికి లేదని అంటున్నారని, ప్రజల మనస్సుల్లో అలాంటి భావన వస్తే, కూటమిలోని అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ దీనికి బాధ్యత వహిస్తుందని చెప్పారు. సమన్వయం లేదు, చర్చలు లేవని, దీంతో ఇండియా కూటమిలో అంతా బాగానే ఉందా..? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని రౌత్ చెప్పారు. ఒకసారి ఇండియా కూటమి విడిపోతే మళ్లీ ఇంకెప్పటికీ కలవదని ఆయన జోస్యం చెప్పారు.