Indians Use Antibiotics Excessively, Azithromycin On Top: దేశంలో ప్రజలు యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కు ముందు, కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను విస్తృతంగా వాడినట్లు స్టడీలో వెల్లడించింది. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరం, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ కు లొంగకుండా తయారవుతుందని లాన్సెట్ వెల్లడించింది. ఇండియాలో చాలా మంది జ్వరం వచ్చినా.. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా.. డోలో -650, అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ వాడటం పరిపాటిగా మారింది. యాంటీబయాటిక్స్ మితిమీరి వాడటం వల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయని స్టడీ పేర్కొంది.
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు తేలిన తర్వాతే యాంటీబయాటిక్స్ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీబయాటిక్స్ ను తరుచుగా వాడటం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే.. 44 శాతం అనుమతి లేని యాంటీబయాటిక్స్ ను వాడుతున్నట్లు స్టడీలో తేలింది. భారతదేశంలో మొత్తం 1098 యాంటీబయాటిక్స్ ఫార్ములేషన్స్ తో 10,100 బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో కేవలం 46 శాతం బ్రాండ్లు (19 శాతం ఫార్మలేషన్స్) మాత్రమే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్( సీడీఎస్సీఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
Read Also: Wife Offers Supari To Kill Husband: సుపారి ఇచ్చి భర్త హత్య.. భార్యని పట్టించిన కాల్ డేటా
అయితే కొన్ని కంపెనీలు యాంటిబయాటిక్స్ తయారీకి సీడీఎస్సీఓ అనుమతి లేకుండానే రాష్ట్రాల అనుమతులును పొందుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ తయారవుతున్నాయి. ప్రతీ చిన్న అనారోగ్యానికి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో వీటిని తట్టుకునేలా బ్యాక్టీరియా శక్తి సంపాదించుకుంటుంది. దీంతో యాంటీబయాటిక్స్ శరీరంపై పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న అనారోగ్యానికి కూడా యాంటీబయాటిక్స్ వాడటాన్ని తగ్గించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.