భారత రాష్ట్రపతి పదవి అనేది ఎంతో కీలకం. దేశం మొత్తం పరిపాలన అంతా రాష్ట్రపతి పేరుమీదే కొనసాగుతుంది. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. నిజానికి భారత ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతే అయినా.. వాస్తవంగా అధికారం చెలాయించేది ప్రధాని సారథ్యంలోని మంత్రి మండలి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం రాష్ట్రపతికి విశేష అధికారాలను కల్పించింది భారత రాజ్యాంగం. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో భారత రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉంటాయి.
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా సాధారణం కన్నా భిన్నంగా ఉంటుంది. రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల్లోని శాసనసభ్యులతో పాటు ఢిల్లీ, పుదుచ్చేరిలోని శాసనసభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. ఒక్కో అభ్యర్థికి ఓటు విలువ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం రాష్ట్రపతి ఎన్నిక ఓటర్ల సంఖ్య 4,809గా ఉంది. ఇందులో పార్లమెంట్ ఉభయసభల సభ్యుల సంఖ్య 776 కాగా.. దేశంలోని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభ్యుల సంఖ్య 4,033గా ఉంది.
చట్టసభలకు చెందిన 50 మంది అభ్యర్థలు ప్రతిపాదిస్తూ, మరో 50 మంది సభ్యులు బలపరుస్తూ చేసిన సంతకాలతో కూడిన నామినేషన్ ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి దాఖలు చేయాలి. దేశంలోని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కో ఓటు విలువ ఉంటుంది. సహజంగా పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ ఓటు విలువ ఉండటంతో పాటు చిన్న రాష్ట్రాలకు తక్కువ ఓటు విలువ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లోని జనభా, ఇతరత్రా అంశాల అధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువను నిర్ణయిస్తారు. దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు అత్యధికంగా 208 ఓటు విలువ ఉండగా.. ఆ తరువాత మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు 175 ఓటు విలువ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఎంఎల్ఏలకు అతి తక్కువగా కేవలం 8 ఓటు విలువ ఉంది. దీంతో పాటు పార్లమెంట్ కు చెందిన సభ్యుల ఓటు విలువ 708గా ఉంది.
ప్రస్తుతం మొత్తం పార్లమెంట్ ఉభయసభలకు చెందిన సభ్యుల ఓటు విలువ 5,49,408 (776 ఎమ్.పిలు X 708= 5,49,408)కాగా.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ల ఓటు విలువ సుమారు 5,49,495గా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం సభ్యుల ఓటు విలువ 10,98,903. సగానికి పైగా ఓట్లు( సింపుల్ మెజారిటీ) నమోదైన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికోబడుతారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి,దాని మిత్రపక్షాలను కలుపుకుని 5,39,827 ఓటు విలువ ఉంది. అయితే శివసేన, అకాలీదళ్ కూటమి నుంచి వెళ్లిపోవడంతో ఎన్డీమే అభ్యర్థి గెలుపుకు 9,625 తక్కువగా ఉన్నాయి. అయితే ఓడిశాలోని బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వాలు బీజేపీకి అండగా నిలిచే అవకాశం ఉంది. దీంతో దాదాపుగా ఎన్డీయే ప్రతిపాదించిన వ్యక్తి మళ్లీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దాదాపుగా సులువే. సాధారణ ఎన్నికల్లోలా కాకుండా.. ఎలక్టోరల్ కాలేజీలోని ఓటర్ తమ ఓటును ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థులకు వేయాల్సి ఉంటుంది.