Indian Navy: బంగ్లాదేశ్ సంక్షోభం, ఈ ప్రాంతంలో అస్థిరత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి భారత నావికాదళం టాప్ కమాండర్లు కీలక సమావేశం నిర్వహించనున్నారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడంతో పాటు ఆ దేశంలో పాకిస్తాన్, చైనా అనుకూల శక్తుల ఉనికి పెరుగుతుండటం, రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల ప్రభావం పెరుగుతుండటంతో భారత్‌కి భద్రతా సమస్యలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పాకిస్తాన్ నుంచి బంగ్లాకు సైనిక మద్దతు పెరుగడం, చైనా కార్యకలాపాలు కూడా కీలక ఆందోళనలుగా ఉన్నాయి.
Read Also: Bangladesh: “ఉర్దూ, జిన్నా” వైపు బంగ్లాదేశ్ అడుగులు.. స్వాతంత్య్ర లక్ష్యాలని మరిచిపోతున్నారు..
ఢిల్లీలోని కొత్త నౌకాదళ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 17 నుంచి నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నావికాదళ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి సదస్సు. ఇటీవల లక్నోలో జాయింట్ కమాండర్ల సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ దళాలు ఊహించని వాటికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కొత్త థియేటర్ కమాండ్స్‌ని రూపొందించడంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇండియన్ నేవీ ఏడాదికి రెండుసార్లు కమాండర్ల స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సముద్రపు దొండలు, డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా గల్ఫ్ ఆఫ్ అడెన్లో ఆపరేషన్ల గురించి నావికాదళం సమీక్షించింది.