Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.. పాక్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..

Army Chief

Army Chief

Operation Sindoor: భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి దిగితే, సమాధానం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు వెంబడి 8 ఉగ్రవాద శిబిరాలు చురుకుగా ఉన్నాయని, వీటిలో 6 నియంత్ర రేఖ వెంబడి, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: US Iran Tensions: ఇరాన్‌పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్ ఎయిర్‌బేస్‌లో విమానాల మోహరింపు..

గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకోబడింది. ఆపరేషన్ సిందూర్ మే 7, 2025న ప్రారంభమైంది, ఉగ్రవాద లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాం. పహల్గామ్ దాడి తర్వాత, నిర్ణయాత్మక ప్రతిస్పందనను అందించడానికి అత్యున్నత స్థాయిలో స్పష్టమైన నిర్ణయం తీసుకోబడింది. ఆపరేషన్ సిందూర్ చాలా ఖచ్చితత్వంతో అమలు చేయబడింది. మే 7న మొదటి 22 నిమిషాల్లో ప్రారంభమై మే 10 వరకు మొత్తం 88 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో మేము తీవ్రమైన దాడి చేసాము, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీశాము. పాకిస్తాన్ యొక్క అణు బెదిరింపులను ధ్వంసం చేసాము. తొమ్మిది లక్ష్యాలలో ఏడింటిని మేము పూర్తిగా నాశనం చేసాము.’’ అని చెప్పారు.

పాకిస్తాన్ ఏదైనా పిచ్చి పనికి పాల్పడితే తీవ్రమైన సమాధానం ఉంటుందని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. సీఏపీఎఫ్, నిఘా సంస్థలు, హోం మంత్రిత్వ శాఖ, రైల్వేలతో సహా అన్ని సంబంధిత విభాగాల క్రియాశీల పాత్రను ఆర్మీ చీఫ్ ప్రశంసించారు.

Exit mobile version