India Was World’s 4th Largest Defence Spender In 2022: ప్రపంచంలో దేశ రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ చుట్టూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో భారత్ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది. 2021తో పోలిస్తే భారత్ రక్షణ వ్యయం 6 శాతం పెరిగినట్లు స్వీడన్ దేశానికి చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే రక్షణపై ఎక్కువగా ఖర్చు చేస్తున్న నాలుగో అతిపెద్ద దేశంగా ఇండియా నిలిచినట్లు నివేదిక వెల్లడించింది.
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశ మొత్తం వ్యయంలో 23 శాతం నిధులు సైనిక పరికరాలు, మౌళిక సదుపాయాల కోసం వెచ్చిస్తోందని తెలిపింది. ఈ రక్షణ వ్యయంలో ఎక్కువ భాగం జీతాలు, ఫించన్ల వంటి ఖర్చులకే పోతున్నాయని తెలిపింది. 81.4 బిలియన్ డాలర్ల సైనిక వ్యయంతో భారత్ దేశ వ్యయం 2021 నుంచి 6 శాతం, 2013తో పోలిస్తే 47 శాతం పెరిగింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్తతతోనే భారత్ సైనిక వ్యయాన్ని అధికంగా పెంచుతున్నట్లు తెలుస్తోందని నివేదిక అభిప్రాయపడింది.
Read Also: Russia: ఒకే రోజు పుతిన్ సన్నిహితులు ఇద్దరు మృతి..
2022లో ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా 39 శాతం వాటాను కలిగి ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (13 శాతం), రష్యా (3.9 శాతం), భారతదేశం (3.6 శాతం), సౌదీ అరేబియా (3.3 శాతం) ఉన్నాయి. 2022లో మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో ఈ ఐదు దేశాలు మొత్తం 63 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2022లో సైన్యంపై అత్యధికంగా ఖర్చు చేసిన 15 దేశాల సైనిక వ్యయం 1,842 బిలియన్ డాలర్లుగా, ఇది ప్రపంచంలో 82 శాతాన్ని కలిగి ఉంది. మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2022లో 3.7 శాతం పెరిగి 2,240 బిలియన్లకు చేరుకుంది. గత 30 ఏళ్లలో పోలిస్తే యూరప్ రక్షణ వ్యయం కూడా పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
2022 లో అత్యధికంగా సైనిక వ్యయం చేసిన దేశాల్లో అమెరికా, చైనా, రష్యాలే 50 శాతాన్ని కలిగి ఉన్నాయి. 2021లో భారతదేశం సైనికవ్యయం పరంగా 76.6 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇది 2016 ఇండియా 55.9 బిలియన్ డాలర్లలో ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యయదారుగా ఉంది.