Execution: యెమెన్ దేశంలో కేరళ నర్సు నిమిషా ప్రియాకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ఈ శిక్ష నుంచి ఆమెను తప్పించేందుకు, షరియా చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి ‘‘బ్లడ్ మనీ’’ కింద పరిహారం ఇచ్చేందుకు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. జూలై 14న భారత సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు విచారణ రానుంది. యెమెన్ దేశస్తుడి నుంచి తన పాస్‌పోర్టు తీసుకునేందుకు, నిమిషా ప్రియా మత్తు మందు ఇచ్చింది. ఇది వికటించి అతను మరణించడంతో, ఆమెకు అక్కడి చట్టాలు ఉరిశిక్ష విధించాయి.
ఇదిలా ఉంటే మరో దేశంలో కూడా ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష విధించబడింది. ఇండోనేషియాలోని కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషులుగా తేలిన తర్వాత ఇండోనేషియా చట్టాల ప్రకారం శిక్షను విధించారు. ఈతీర్పు అక్కడి హైకోర్టులు కూడా సమర్థించాయి. రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమల్కందన్‌లు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Read Also: Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..
అయితే, ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి కోరారు. ఓడ కెప్టెన్, సిబ్బందితో సహా అందరు సాక్షుల్ని మరోసారి క్షుణ్ణంగా విచారించాలని కోరారు. ఇండోనేషియా న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకుం ఉందని, దర్యాప్తులో కొన్ని తేడాలను చూశామని, మొబైల్ ఫోన్ రికార్డులతో సహా అన్ని ఆధారాలను పరిశీలించలేదని చెప్పారు.
గత ఏడాది జూలైలో ఇండోనేషియాలోని రియావు దీవులలోని కరీమున్ ద్వీపం సమీపంలో సింగపూర్ జెండాతో ఉన్న ఓడ నుండి భారత పౌరులైన రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్ , గోవిందసామి విమల్కందన్‌లను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి స్థానిక కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. హైకోర్టు కూడా వీరి శిక్షని సమర్థించింది. రాబోయే రోజుల్లు వీరిని కూడా ఉరి తీసే అవకాశం ఉంది. అరెస్ట్ నుంచి విచారణ ప్రక్రియ వరకు ఇండోనేషియా అధికారులు నిర్లక్ష్యం వహించారిన భారత దౌత్యకార్యాలయం ఆరోపించింది. వీరి ముగ్గురిని విడిపించేందుకు భారత్ దౌత్య మార్గాల ద్వారా ఒత్తిడి తెస్తోంది.