PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉందని శుక్రవారం అన్నారు. భారత ఆర్థిక ప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రపంచ అస్థిర వాతావరణాన్ని ప్రస్తావిస్తూ.. దేశ ప్రయోజనాలకు సేవ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ప్రతీ పనిని చేస్తోందని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినంత వరకు అప్రమత్తంగా ఉండాలని వారణాసిలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన అన్నారు. ‘‘మా ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం చేయగలిగినదంతా చేస్తోంది. దేశానికి ఉత్తమంగా ఉండాలని కోరుకునేవారు, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడాలనుకునేవారు, అది ఏ రాజకీయ పార్టీ అయినా, తమ విభేదాలను పక్కనపెట్టి ‘స్వదేశీ’ ఉత్పత్తుల కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి’’ అని అన్నారు.
Read Also: Raghunandan Rao: హిందువులను టెర్రరిస్టులుగా యూపీఏ ప్రభుత్వం చూపించింది..
మనమంతా భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని, స్థానికుల కోసం మనం గొంతు కలపాలని ప్రధాని అన్నారు. జూలై 31న, భారతదేశ ఉత్పత్తులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన ఒక రోజు తర్వాత, ట్రంప్ భారత్-రష్యా సంబంధాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు దేశాలు చనిపోయిన ఆర్థిక వ్యవస్థలుగా మరింత దిగజారిపోతాయని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ప్రధాని మోడీ నుంచి కౌంటర్‌గా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని చెప్పారు.
వారణాసి ర్యాలీలో, పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాద శక్తులు పాతాళలోకంలో ఉన్నప్పటికీ వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మహాదేవుడు తన రుద్ర రూపాన్ని అలంకరించాడు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సత్తాను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. పాకిస్తాన్ బాధను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ భరించలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.