దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,32,777 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 42 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 14,553 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,690గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా నమోదైంది
రోజువారీ కేసుల సంఖ్య శనివారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,36,22,651కు చేరింది. ఇందులో 4,29,68,533 మంది కోలుకోగా.. 5,25,428 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.50 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.30 శాతంగా ఉంది.
ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా చాలా వరకు కేసులను, మరణాలను అడ్డుకోగలుగుతున్నామని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే దాదాపుగా 80 శాతం ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 1,98,76,59,299 డోసులను అర్హులైన ప్రజలకు అందించారు. గడిచిన 24 గంటల్లో 10,21,164 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్ల 65లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచదేశాల్లో కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,81,875 మంది వైరస్ బారినపడ్డారు. మరో 844 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,01,94,924కు చేరింది.