India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన వాదనను పూర్తిగా తిరస్కరించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక ప్రకటనలో.. NATO నాయకత్వం అటువంటి ప్రకటనలు చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ఎప్పుడూ జరగని సంభాషణలు” గురించి ఊహాజనిత వ్యాఖ్యలు “ఆమోదయోగ్యం కాదు” అని నొక్కి చెప్పింది.
“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఫోన్ సంభాషణకు సంబంధించి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన ప్రకటనను మేము చూశాము. ఆ ప్రకటన వాస్తవంగా తప్పు, పూర్తిగా నిరాధారమైనది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షుడు పుతిన్‌తో సూచించిన విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి సంభాషణ జరగలేదు” అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇంధన దిగుమతి నిర్ణయాలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
