PM Modi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం యుద్ధం అంచున ఉన్న ఈ తరుణంలో భారత్‌కి ప్రధాని మోడీ బలమైన నాయకత్వం అవసరమని బుధవారం అన్నారు. ‘‘ప్రపంచమంతా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వివిధ దేశాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారత్‌కి మోడీ వంటి బలమైన నాయకత్వం అవసరం. ఆయన మూడోసారి అధికారంలోకి రావాలి. ఈ తరుణంలో నాయకత్వం బలహీనమైన వారి చేతిలోకి వెళ్తే దేశం నష్టపోతుంది’’ అని వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ అన్నారు.
Read Also: Amit Shah: కాశ్మీర్‌లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది.
సోమవారం హరిద్వార్‌లోని పిరాన్ కలియార్‌లో సాబీర్ సాహెబ్ దర్గా వద్ద ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో కలిసి ప్రధాని మోడీ కోసం షాదబ్ చాదర్ సమర్పించారు. భారత అభివృద్ధి చెందేందుకు వరసగా మూడోసారి ఆయన అధికారంలోకి రావాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరాయని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చివరి వ్యక్తికి కూడా చేరుతున్నాయని, మరుగుదొడ్డి, సొంత ఇళ్ల వంటి కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని షాదాబ్ అన్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో ముస్లింలకు గానీ, భారత రాజ్యాంగానికి గానీ ప్రమాదం లేదని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన చెప్పారు. రాజ్యాంగానికి కానీ, ముస్లింలకు కానీ ఎలాంటి ముప్పు లేదని, కొందరు రాజకీయ నాయకుల దుకాణం మాత్రమే ప్రమాదంలో పడిందని, దేశ ప్రజల్ని, ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.