India Canada: ఇండియా కెనడాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా ఆరుగురికి ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. కెనడా ఆరోపణల్ని కొట్టిపారేసిన ఇండియా, కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకుంది. అదే సమయంలో ఇండియాలోని ఆరుగురు కెనడా దౌత్యవేత్తల్ని శనివారం లోగా దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి పేర్లను దౌత్యవేత్తలు సేకరించి, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి ఇస్తున్నారని కెనడా పోలీసులు ఆరోపించడం మరింత సంచలనంగా మారింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాకు భారత్ షాక్ ఇచ్చింది. కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీలో పనిచేస్తున్న నిషేధిత అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ (ISYF) సభ్యుడు సందీప్ సింగ్ సిద్ధూ పంజాబ్‌లో ఉగ్రవాద కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాడని భారత్ ఆరోపించింది. 2020లో పంజాబ్ తరణ్ తరణ్‌లో బల్వీందర్ సింగ్ సంధూ హత్యను అమలు చేయడానికి పాకిస్తాన్‌కి చెంది ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్, పాక్ ఐఎస్ఐ వ్యక్తులతో టచ్‌లో ఉన్నాడని భారత్ పేర్కొంది. సందీప్ సింగ్ సిద్ధూని బహిష్కరించాలని, ఇతడిని పరారీలో ఉన్న ఉగ్రవాదిగా భారత్ పేర్కొంది.
బల్విందర్ సింగ్ 1980లలో పంజాబ్ మిలిటెన్సీ, ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోరాడారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని గట్టిగా వ్యతిరేకించారు. వృత్తిరీత్యా టీచర్ అయినా, ఖలిస్తాన్ ఉగ్రవాదుల దాడుల్ని తప్పికొట్టడంతో అతని సాహసోపేత చర్యలకు శౌర్య చక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఇచ్చింది. సిఖ్స్ ఫర్ జస్టి్స్(ఎస్‌జేఎఫ్) ద్వారా అమెరికా, కెనడాల్లో ప్రజాభిప్రాయ సేకరణను బల్వీందర్ సింగ్ వ్యతిరేకించారు.
బల్వీందర్ హత్యలో సందీప్ సింగ్ సిద్ధూ హస్తం ఉందని భారత్ ఆరోపించింది. ఇతడిని నేర చరిత్ర ఉన్నప్పటికీ కెనడా బోర్డర్ సెక్యూరిటీలో సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. బల్వీందర్ సింగ్ హత్యలో అమెరికా, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్) కార్యకర్తలు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని ఎన్ఐఏ కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టుకు తెలిపింది. బల్వీందర్ సింగ్ హత్యలో కెనడాకు చెందిన ఖలిస్తానీ సన్నీ టొరంటో, పాక్‌కి చెందిన లక్బీర్ సింగ్ రోడ్ నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. అయితే, సందీప్ సింగ్ సిద్దూ మారుపేరు సన్నీ టొరంటో అనే అనుమానాలు ఉన్నాయి.
Read Also: Kolkata: జూడాలకు సీఎం మమత ఫోన్.. డిమాండ్లకు 4 నెలలు సమయమివ్వాలని వినతి
ఎవరు ఈ బల్వీందర్ సింగ్ సంధూ..
బల్వీందర్ సింగ్‌ని ఇద్దరు గుర్తుతెలియని దుండగులు 2020 అక్టోబర్ నెలలో తరణ్ తరణ్‌లోని భిఖివింద్‌లోని అతడి కార్యాలయం వెలుపల కాల్చి చంపారు. పంజాబ్ ఉగ్రవాదం సమయంలో 42 సార్లు ఆయనపై ఖలిస్తానీ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 202లో ఖలిస్తాన్ రెఫరెండాన్ని వ్యతిరేకించడం వల్లే తన భర్తను చంపారని బల్విందర్ భార్య జగదీష్ కౌర్ సంధు చెప్పారు. తన భర్తపై 1990 జనవరిలో మొదటి దాడి జరిగినట్లు వెల్లడించారు.
1993 వరకు సంధు కుటుంబం టార్గెట్‌గా ఖలిస్తాన్ ఉగ్రవాదులు 16 హత్యా ప్రయత్నాలు చేశారు. అయితే, ప్రతీసారి ఆ కుటుంబం ఉగ్రవాదుల్ని అడ్డుకుంది. 1990లో 200 మంది ఖలిస్తానీలు బల్వీందర్ ఇంటిని చుట్టుముట్టారు. రాకెట్ లాంచర్లతో సహా ఇతర ఆయుధాలతో 5 గంటలు దాడి చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి సాయం రాకుండా రహదారిని ఉగ్రవాదులు బ్లాక్ చేశారు.ప్రభుత్వం అందించిన స్టన్ గన్స్, పిస్టోల్స్‌తో సంధు సోదరులు, వారి భార్యలు ఉగ్రవాదులపై పోరాడారు. ఉగ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టారు.