Mohan Bhagwat: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ప్రతిష్ఠాపన రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలన్నారు. భారత్ శత్రువులతో ఎన్నో శతాబ్దాల పాటు పోరాడింది.. రామమందిర ఉద్యమం ఎవరినీ వ్యతిరేకించడానికి ప్రారంభించింది కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక, దేశం తనను తాను మేలుకొల్పుకోవడానికి చేసింది మాత్రమే అన్నారు. తద్వారా భారత్ తన కాళ్లపై నిలిచి ప్రపంచానికి మార్గం చూపిస్తుందన్నారు. రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలు కనిపించలేవని మోహన్ భగవత్ తెలిపారు.
ఇక, రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర టస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కి ‘దేవీ అహల్య అవార్డు’ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్‌లో ఏర్పాటు చేసిన అవార్డు అందజేత కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. చంపత్ రాయ్ ఈ అవార్డును.. రామమందిర ఉద్యమంలో పాల్గొన్న వారికి, మందిర నిర్మాణానికి కృషి చేసిన వారికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గతేడాది జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఇంకో ఎనిమిది రోజుల్లో ఈ కార్యక్రమం జరిగి సంవత్సరం పూర్తి కావొస్తుంది.