NTV Telugu Site icon

Masood Azhar: పాక్‌లో స్వేచ్ఛగా మసూద్ అజార్.. కఠిన చర్యల కోసం భారత్ డిమాండ్..

Masood Azhar

Masood Azhar

Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ రోజు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ఇదే నిజమైతే, ఉగ్రవాద కార్యకలాపాలను కలిగి ఉన్న పాకిస్తాన్ ‘ద్వంద్వ వైఖరి’ ని బయటపెడుతోందని చెప్పారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. అయితే, గతంలో పలుమార్లు మసూద్ అజార్ తమ గడ్డపై లేరని పాకిస్తాన్ పదేపదే బుకాయించింది. భారతదేశంలో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడిన మసూద్ అజార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది.

Read Also: Nitish Kumar Reddy: అబ్బా.. అలా ఎలా రివర్స్ స్కూప్ షాట్ కొట్టావు నితీష్ (వీడియో)

ఇటీవల బహవల్‌పూర్ ప్రసంగంలో మసూద్ అజార్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూని ‘ఎలుక’గా పోల్చుతూ కించపరిచాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచాలని పిలుపునిచ్చాడు. ఈ ప్రసంగం నవంబర్‌లో జరిగినట్లు సమాచారం. ఇతను భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. సెప్టెంబర్ 2019లో అజార్‌తో పాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారతదేశం యూఏపీఏ చట్టం కింద వ్యక్తిగత ఉగ్రవాదులుగా పేర్కొంది.

2001లో పార్లమెంట్‌పై దాడి, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు, 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడితో అజార్‌కి సంబంధం ఉంది. 2016లో ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా పాల్పడ్డాడు.

Show comments