Gaumutra remark: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన ‘గోమూత్ర రాష్ట్రాలు’ అనే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ‘‘బీజేపీ హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో, అంటే మేము వీటిని గోమూత్ర రాష్ట్రాలని పిలుస్తామని వాటిలోనే గెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ గెలవదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఫలితాలు చూస్తునే ఉన్నాం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఆ వ్యాఖ్యలు అనుకోకుండా చేశానని, విచారం వ్యక్తం చేస్తు్న్నానని, క్షమాపణలు చెప్పారు. ‘‘నేను నిన్న అనుకోకుండా చేసిన ప్రకటన. ఇది సభ్యులు మరియు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే, నేను దానిని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. పదాలను తొలగించమని నేను అభ్యర్థిస్తున్నాను. దానికి నేను చింతిస్తున్నాను’’ అంటూ సెంథిల్ కుమార్ అన్నారు.
Read Also: BJP MPs Resign: బీజేపీ సీఎంలపై ఉత్కంఠ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10 ఎంపీల రాజీనామా..
సెంథిల్ కుమార్ వ్యాఖ్యల్ని పలువురు హిందీ రాష్ట్రాల ఎంపీలు తప్పుపట్టారు. సెంథిల్ కుమార్ ప్రసంగంపై విమర్శలు వెల్లువెత్తడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ఆయన చేసిన వ్యాక్యల్ని బహిష్కరించారు. ఆదివారం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాలను కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఫలితాల తర్వాత ఎంపీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. వరదల్లో చెన్నై మునిగిన విధంగానే డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, వారి అహంకారమే పతనానికి దారి తీస్తుందని అన్నారు. పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉందని, నిన్నమొన్నటి వరకు కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉన్న విషయాన్ని డీఎంకే మరిచిపోయిందని అన్నారు. కొన్ని నెలల క్రితం డీఎంకే మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.