Yogi Adityanath: అయోధ్యలో ఈ రోజు రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ సీఎం దివంగత ములాయం సింగ్ యాదవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 1990లో అయోధ్యలో జరిగిన కాల్పుల్లో 17 మంది కరసేవకులు మరణించారు. ఈ సమయంలో ములాయం సింగ్ సీఎంగా ఉన్నారు.
యోగి మాట్లాడుతూ.. ‘‘ఇకపై అయోధ్య అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అయోధ్య సందుల్లో బుల్లెట్ల మోతతో ప్రతిధ్వనించదు. కర్ఫ్యూలు ఉండవు. ఇప్పుడు దీపోత్సవం, రామోత్సవాలు జరుతాయి. రామకీర్తనలు ప్రతిధ్వనిస్తాయి. ఈ రోజు ఇక్కడ రామ్ లల్లా రామరాజ్యాన్ని సూచిస్తున్నారు’’. అని ఆయన అన్నారు. 1990 సంఘటనల గురించి ప్రస్తావిస్తూ..ఎస్పీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mamata Banerjee: రామ మందిరానికి పోటీగా.. బెంగాల్‌లో మమత “సర్వమత” ర్యాలీ
అసలేం జరిగింది:
1990లో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సారథ్యంలో రథయాత్ర నేపథ్యంలో రామ మందిర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకుంటుండటంతో సీఎంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ బలగాలను మోహరించారు. ‘‘అయోధ్యలో ఒక్క పక్షి కూడా ఎగరదు’’ అని ములాయం సింగ్ ప్రకటించాడు. అక్టోబర్ 30న రాష్ట్ర పోలీసులు బస్సుల్ని, రైళ్లను అడ్డుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు పాదయాత్ర చేశారు. బాబ్రీ మసీదు వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో నవంబర్ 1న పోలీసులు కాల్పులు జరపడంతో 17 మంది కరసేవకులు మరణించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. అతని కాలంలోనే డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదుని కూల్చివేత జరిగింది.