Southwest Monsoon: దేశంలోకి అనుకున్న విధంగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ 1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని అనుకున్నప్పటికీ రెండు రోజుల ముందుగానే మే 30న కేరళ తీరానికి రుతుపవనాలు చేరాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళ తీర ప్రాంతంలోని కోజికోడ్ వంటి పట్టణాలతో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే మరోవైపు దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు కూడా ఇదే రోజు రుతుపవనాలు చేరాయి.
చాలా అరుదుగా మాత్రమే కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాలకు ఒకేసారి రుతుపవనాలు వస్తాయి. ఈ సారి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘రెమల్’’ తుఫాన్ కారణంగా ఇది సాధ్యమైనట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చివరిసారిగా 2017లో ఇలా ఒకేసారి రుతుపవనాలు రెండు ప్రాంతాలకు విస్తరించాయి. ఆ సమయంలో కూడా బంగాళాఖాతంలో ‘‘మోరా’’ తుఫాను ఏర్పడటం గమనార్హం.
Read Also: Prajwal Revanna: జర్మనీలో విమానం ఎక్కిన ప్రజ్వల్ రేవణ్ణ.. సెక్స్ టేపుల కేసులో కీలక పరిణామం..
నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా ప్రవేశించాయని, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ మరియు అస్సాంలోని చాలా ప్రాంతాలతో సహా ఈశాన్య భారతదేశంలోకి కూడా ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. వచ్చే 24 గంటల్లో కేరళ అంతటా రుతుపవనాలు వ్యాపించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు కేరళతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అన్నారు.
ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి మరియు దేశంలోని దాదాపు 50 శాతం వ్యవసాయ భూములకు ఇది ఏకైక నీటిపారుదల వనరుగా ఉన్నందున భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశంలోని పెద్ద ప్రాంతాలు తాగునీటి సరఫరా కోసం కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాలు కేరళలో రెండు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి మరియు జూన్ 8 న ముంబైకి చేరుకుంటాయి.