Police Dog: కర్ణాటకలో ఓ పోలీస్ జాగిలం వీరోచితంగా ఒక అనుమానాస్పద హంతకుడిని పట్టించడంతో పాటు మహిళను రక్షించింది. వర్షంలో 8 కి.మీ తడుస్తూ పరిగెత్తి హంతకుడిని గుర్తించింది. ఒక మహిళ ప్రాణాలను రక్షించడంలో పోలీస్ జాగిలం కీలక పాత్ర పోషించింది. గురువారం చన్నగిరి తాలుకా సంతబెన్నూర్‌లోని పెట్రోల్ పంప్ సమీపంలోని బడా రోడ్డులో ఒక వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమైంది. ఈ కేసులో హంతకుడిని గుర్తించేందుకు తుంగ-2 అనే పోలీస్ జాగిలాన్ని బరిలోకి దించారు.
Read Also: Hyderabad: విద్యుత్ సిబ్బందిపై దాడి చేస్తే చట్టపరమైన చర్యలు- TGSPDCL CMD
ఎస్పీ ఉమా ప్రశాంత్ తుంగ-2తో పాటు దాని హ్యాండ్లర్, కానిస్టేబుల్ షఫీ, ఇతర సిబ్బందిని ఘటనాస్థలంలో మోహరించారు. డాబర్‌మాన్ కుక్క వ్యక్తి దుస్తులను వాసన చూసి, చన్నపురా వైపు పరుగులు తీసింది. పోలీస్ జాగిలం తుంగ-2 దాని హ్యాండ్లర్ దాదాపుగా 8 కి.మీ పరిగెత్తారు. హఠాత్తుగా ఓ ఇంటి ముందు కుక్క ఆగిపోయింది. అదే సమయంలో ఆ ఇంటి నుంచి వస్తున్న అరుపుల్ని పోలీసులు విన్నారు. లోపలికి వెళ్లి చూడగా, రంగస్వామి అనే వ్యక్తి భార్యను తీవ్రంగా కొట్టడం గమనించారు. అప్పటికే సదరు మహిళ తీవ్రగాయాలతో ప్రాణాలు పోయే స్థితిలో ఉంది.
అతడిని విచారించగా వారు వెతుకుతున్న హంతకుడు రంగస్వామే అని తేలింది. రోడ్డు పక్కన దొరికిన శవం సంతబెన్నూర్‌కి చెందిన సంతోష్(33)దిగా పోలీసులు గుర్తించారు. భార్యతో అక్రమ సంబంధం ఉందనే కారణంతో సంతోష్‌ని రంగస్వామి వేట కొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత మృతుడు సంతోష్ వానన చూసిన పోలీస్ జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి నిందితుడు రంగస్వామి ఇంటి వైపు వెళ్లి పట్టించింది.