Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిన్న తీహార్ జైలు నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఆయన జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. ఈ రోజు ఆయన విలేకరులు సమావేశం నిర్వహించారు. ఇందులో బీజేపీ, ప్రధాని మంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే ప్రతిపక్ష నాయకులనే కాకుండా, సొంత పార్టీ నేతల్ని కూడా జైలులో పెడతారని ఆరోపించారు. ప్రధాని మోడీ ‘‘వన్ నేషన్-వన్ లీడర్’’ని ప్రారంభించారని దుయ్యబట్టారు.
Read Also: Botsa Satyanarayana: సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు..
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని ముగించబోతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ల రాజకీయ జీవితాలు ముగిశాయి. వీరి తర్వాత యోగి ఆదిత్య నాథ్ ఉన్నారు’’ అని అన్నారు. పీఎం మోడీ గెలిస్తే రెండు నెలల్లో యూపీ సీఎం యోగిని మారుస్తారని చెప్పారు.
‘‘మన దేశం చాలా పాతది, ఎప్పుడైతే ఒక నియంత ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడో, ప్రజలు అతడిని నిర్మూలించారు. ఈ రోజు మళ్లీ ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. నేను 140 కోట్ల మంది ప్రజల్ని అడుక్కోవడానికి వచ్చాను’’ అని అన్నారు. బీజేపీ అధికారం చేపట్టడానికి మోడీ, అమిత్ సా ఇంజనీర్లుగా ఉన్నారని పేర్కొన్నాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెక్కల్ని కత్తిరించిందని ఆయన ఆరోపించారు.