Ashok Gehlot: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీలో బీజేపీ గెలిచింది. అయితే ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికపై మాత్రం బీజేపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఫలితాలు వెలువడి ఆరు రోజులు గడుస్తున్నా.. సీఎంలను ఖరారు చేయలేదు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. బీజేపీ సీఎంలను ఎంపిక చేయడంలో విఫలమైందని, బీజేపీ అసలు రంగు చూపించిందని, పార్టీలో క్రమశిక్షణ లోపించిందని గెహ్లాట్ ఆరోపించారు. ఒక వేళ గెలిచిన తర్వాత కాంగ్రెస్ సీఎంలను ఎంపిక చేయకపోతే, కాంగ్రెస్‌లో అంతర్గత పోర, చీలికలు వచ్చాయంటూ బీజేపీ ఆరోపించేదని అన్నారు. సీఎంలను నిర్ణయించకపోతున్నారని, వారు కాంగ్రెస్‌లో క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారని గెహ్లాట్ అన్నారు.
Read Also: Bhavya Bishnoi: ఐఏఎస్‌తో పెళ్లికి రెడీ అయిన మెహ్రీన్ మాజీ ప్రియుడు.. 3 లక్షల మందికి ఆహ్వానం!
డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 199 సభ్యుల అసెంబ్లీలో 115 స్థానాలను గెలుచుకున్న తర్వాత రాజస్థాన్‌లో బిజెపి తన పాలనను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల ముందు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ తన సీఎం అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఇదిలా ఉంటే గెహ్లాట్ ఆరోపణలపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి స్పందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థిని ఎన్నిక చేయడానికి కాంగ్రెస్‌కి 16 రోజులు పట్టిందన్న విషయాన్ని గెహ్లాట్ మరిచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్ష నేతను ఎందుకు నిర్ణయించలేకపోతోందని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధర రాజే ముందు వరసలో ఉన్నారు. వీరితో పాటతు మాజీ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, పార్టీ ఎంపీలు బాబా బాలక్ నాథ్, దియాకుమారి పోటీలో ఉన్నారు.