CM Bhupesh Baghel: బీరాన్ పూర్ ఘటనపై బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. బీజేపీ సీనియర్ నేతల కుమర్తెలు ముస్లింలను ప్రేమిస్తే దాన్ని ప్రేమ అంటున్నారని, వేరేవారు ప్రేమిస్తే ‘‘లవ్ జీహాద్’’ అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్ లో అత్యంత సీనియర్ బీజేపీ నాయకుడు కుమార్తె ఎక్కడ ఉందో అడగండి..దాన్ని లవ్ జిహాద్ అనడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. బీజేపీ నేతల కుమార్తెలు చేస్తే ప్రేమ, వేరే వారు చేస్తే జిహాదా..? అని అడిగారు.
Read Also: Meta: ఫ్రీ ఫుడ్ ఇక లేదు.. మెటా నిర్ణయంపై ఉద్యోగుల అసంతృప్తి..
అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ఓపీ చౌదరి మాట్లాడుతూ.. సీఎం లవ్ జీహాద్ కు పెద్ద మద్దతుదారు అని ఆరోపించారు. ఈ ప్రకటనను చూస్తే హిందువుల పట్ల ఆయన ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం అవుతుందని అన్నారు. తన రాజకీయాలను కాపాడుకోవడానికి బఘేల్ నిరాధారమైన ప్రకటన చేస్తున్నాడని అన్నారు. ప్రియాంక వాద్రాను ప్రసన్నం చేసుకునేందుకు హిందూ మహిళలపై మీరు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో ఛత్తీస్‌గఢ్ మొత్తం గమనిస్తోంద చౌదరి అన్నారు.
అంతకుముందు, బెమెతర జిల్లా బీరాన్ పూర్ గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో మరణించిన భునేశ్వర్ సాహు బంధువులను ముఖ్యమంత్రి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 8న బెమెతరలోని బీరాన్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో భునేశ్వర్ మరణించాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన తర్వాత ఏప్రిల్ 10న విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీని తర్వాత ఏప్రిల్ 11న బీరాన్ పూర్ సమీపంలో ఓ గ్రామం సమీపంలో ఇద్దరు వ్యక్తులు శవాలుగా కనిపించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ముగ్గురు ప్రాణాలను బలికొంది. గ్రామంలో మొత్తం 1000 మంది పోలీసులు మోహరించారు.