Mobile Gaming: మొబైల్, ఆన్లైన్ గేమింగ్స్ కోసం పిల్లలు తల్లిదండ్రుల సంపాదనను ఊడ్చేస్తున్నారు. ఖాతా ఖాళీ అయ్యేదాకా ఈ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు. దీంతో డబ్బులు మొత్తం పోవడంతో లబోదిబోమనడం తల్లిదండ్రుల వంతవుతోంది. క్రమంగా మొబైల్ గేమింగ్స్ కి అడిక్ట్ అవుతూ పిల్లలు లక్షల రూపాయలు ముంచుతున్నారు. ఇటీవల చైనాలో 13 ఏళ్ల బాలిక తల్లి అకౌంట్ నుంచి ఏకంగా రూ.52 లక్షలను తగలెట్టింది. చివరకు విషయం తెలుసుకుని సదరు బాలిక తల్లి కన్నీటి పర్యంతం అయింది.
Read Also: Giriraj Singh: గాడ్సే ఈ దేశ పుత్రుడు.. ఔరంగజేబులా ఆక్రమణదారు కాదు.. ఓవైసీకి కేంద్రమంత్రి కౌంటర్
సరిగ్గా ఇలాంటి ఘటనే మనదేశంలో జరిగింది. ఎక్కడో కాదు మన హైదరాబాద్ నగరంలోనే ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో నివాసం ఉండే 16 ఏళ్ల బాలుడు ‘‘ఫ్రీ ఫైర్ గేమ్’’ కోసం ఏకంగా రూ.36 లక్షలను వెచ్చించాడు. తల్లి అకౌంట్ లో చిల్లిగవ్వ కూడా ఉంచకుండా ఖాళీ చేశాడు. హైదరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ వింగ్ అందించిన వివరాల ప్రకారం.. బాలుడు తన తాత మొబైల్ ఫోన్‌లో పాపులర్ అయిన ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్‌ను మొదట డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఇది ఉచిత గేమ్.. అయితే ఆటలో మరింత సమర్థవంతంగా ఆడేందుకు డబ్బు ఖర్చు చేయడం మొదలుపెట్టాడు.
గేమ్ ఆడేందుకు మొదట తన తల్లి ఖాతా నుంచి రూ.1500, తర్వాత రూ.10వేలు ఖర్చు చేశాడు. క్రమంగా గేమ్ కి బానిసగా మారి, గేమ్ లో రకరకాల ఆయుధాలు కొనుగోలు చేయడానికి, స్కిల్స్ పెంచుకునేందుకు భారీగా డబ్బు ఖర్చు చేస్తూ వచ్చాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా లక్షల్లో వెచ్చిస్తూ వచ్చాడు. ఫ్రీ ఫైర్ గేమ్‌లో రూ.1.45 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లింపులు చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత, కొంత డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బాలుడి తల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని సందర్శించినప్పుడు, ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బు లేక పోవడంతో షాకైంది. ఎస్బీఐ నుంచి రూ. 27 లక్షలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రూ.9 లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. దీంతో మొత్తం రూ. 36 లక్షలను పోగొట్టుకుంది. సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు 11వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి పోలీస్ అధికారి, ఆయన మరణించారు. తన భర్త కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం ఒక ఆట కారణంగా కోల్పోయానని బాధితురాలు వాపోయారు.