ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా? నంబర్ కూడా గుర్తులేదా? తిరిగి ఎలా పొందాలో తెలియక టెన్షన్ పడుతున్నారా? ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు మీరు చాలా సులభంగా, కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డును మళ్లీ పొందవచ్చు.
ప్రస్తుతం మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, ఇన్‌కమ్ ట్యాక్స్, పీఎఫ్ వంటి ఎన్నో సేవలను పొందడానికి ఇది తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఇది ఎప్పుడూ మనతో ఉండేలా చూసుకోవాలంటున్నారు. అయితే, ఆధార్ కార్డ్ పోయినా.. నంబర్ కూడా గుర్తు లేక పోయినా.. కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చని ఆధార్ అధికారులు చెబుతున్నారు. మెదటగా.. UIDAI వెబ్‌సైట్‌ను (https://uidai.gov.in/) ఓపెన్ చేయండి. మీకు అవసరమైన భాషను ఎంచుకోండి. మెను లో Retrieve Aadhaar Number / EID / SID అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. మీ పేరు, జన్మ తేదీ, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేసి క్యాప్చాను ఫిల్ చేయండి. తరువాత Send OTP బటన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేస్తే, కొద్ది సేపటిలోనే మీ ఆధార్ నంబర్ SMS ద్వారా వస్తుంది.ఆ నంబర్‌ను ఉపయోగించి ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే, మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ కాకపోతే SMS రాదు. అలాంటి సమయంలో 1947 అనే UIDAI హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సూచనలను పొందవచ్చు ఆధార్ నిర్వాహాకులు చెబుతున్నారు. లేకపోతే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చన్నారు. అక్కడ సిబ్బంది మీ వివరాలను వెరిఫై చేసి ఆధార్ నంబర్‌ను తిరిగి పొందడంలో సహాయం చేస్తారు. ఆధార్ ప్రింట్ కోసం మీరు రిక్వెస్ట్ చేస్తే వారు అది కూడా అందిస్తారు. దీనికి ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.