Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి వచ్చింది. మరికొద్ది సేపటిలో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు బయటకు రాబోతున్నాయి. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ కుప్పకూలిపోవడంతో గత 17 రోజులుగా కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. అయితే అప్పటి నుంచి అధికారులతో పాటు విదేశాలకు చెందిన టెన్నెల్ నిపుణులు ఈ ఆపరేషన్‌లో భాగమవుతున్నారు. మరికొద్ది సేపట్లో కార్మికులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్లింది.
అయితే అమెరికాకు చెందిన ఆగర్ మిషన్, ఇతర అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించినా ఫలితాలు రాలేదు. చివరకు పురాతనమైన ‘‘ర్యాట్-హోల్ మైనింగ్’’ పద్దతి ద్వారా కార్మికులను రెస్క్యూ చేయబోతున్నారు. కార్మికులకు మరికొన్ని మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది ఉంది.
ర్యాట్-హోట్ మైనింగ్ అంటే..
ర్యాట్ హోల్ మైనింగ్ అనేది బొగ్గును వెలికి తీయడానికి ఉపయోగించే పురాతన పద్ధతి. ఈ పద్ధతిలో 4 అడుగుల వెడల్పు కన్నా చిన్నగా ఉండే గుంటలను తవ్వడం ద్వారా బొగ్గును వెలికితీస్తారు. బొగ్గును వెలికి తీసేందుకు పక్కకు సొరంగాలను చేస్తారు. నైపుణ్యం కార్మికులు పనిముట్లను ఉపయోగించి మాన్యువల్‌గా ఈ ప్రక్రియను చేస్తారు. మేఘాలయ ప్రాంతంలో ఇప్పటికీ ఈ ర్యాట్ హోట్ మైనింగ్ ప్రక్రియను వాడుతున్నారు. మైనర్లు ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు, ఎందుకంటే వీరికి సరిపోయేలా ఈ పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా ఒకరు డ్రిల్లింగ్ చేస్తుంటే, మరొకరు శిథిలాలను తొలగిస్తారు, మరొకరు వాటిని బయటపారేస్తారు.
ర్యాట్ హోల్ మైనింగ్‌పై నిషేధం:
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లో ర్యాట్ హోల్ మైనింగ్‌ను అశాస్త్రీయమని నిషేధించింది. అయినా కూడా ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రమాదాలు పెరగడం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో మైనర్ పిల్లలు మరణాలకు దారి తీశాయి. 2018లో అక్రమ మైనింగ్‌లో పాల్గొన్న 15 మంది పురుషులు8 వరదల కారనంగా గనిలో చిక్కుకుపోయారు. నెలల తరబడి సాగిని ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కేవలం ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. ఇలాగే 2021లో ఐదుగురు మైనర్లు వరదల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 3 మృతదేహాలు లభించాయి.
టెక్నాలజీ వల్ల కాలేదు..
అమెరికన్ ఆగర్ యంత్రం ద్వారా శిథిలాలను డ్రిల్లింగ్ చేసి కార్మికులను రక్షించాలని భావించారు. అయితే 57 మీటర్ల దూరంలో ఉన్న కార్మికులను రక్షించేందుకు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. పలు సందర్భాల్లో యంత్రం చెడిపోవడంతో ఈ పద్ధతి విఫలమైంది. వర్టికల్ డ్రిల్లింగ్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ర్యాట్ హోల్ డ్రిల్లింగ్ కోసం ఢిల్లీ నుంచి రెండు స్పెషలిస్ట్ టీములను, మొత్తం 12 మందిని రప్పించారు. తీసుకువచ్చని వారు పురాతన విధానానికి సాంకేతికతను జోడించే పని చేసే నిపుణులని.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వీరు 800 ఎంఎం పైపు లోపట చేతిలో ఇమిడిపోయే సాధనాలను ఉపయోగించి మాన్యువల్‌గా డ్రిల్లింగ్ చేస్తూ చెత్తను బయటపారేస్తారు.